
పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో ప్రశంసలు పొందుతున్నాయి. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులకు ప్రోత్సాహం అందిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే తల్లిదండ్రులు లేని చిన్నారులకు తన జీతం నుంచి ప్రతి నెల రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్, తాజాగా 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేందుకు ముందుకొచ్చారు.
పిఠాపురం నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 580కు పైగా మార్కులు సాధించిన మొత్తం 31 మంది విద్యార్థులను గుర్తించారు. వీరిలో ఒక విద్యార్థి 598 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచారు. అలాగే నెలవారీ సాయం పొందుతున్న పిల్లల్లో ఏడుగురు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించారు.
ఈ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారి ఆసక్తికి తగ్గ కోర్సులు మరియు కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. అనంతరం ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలతో చర్చించి, అందరికీ ఉచిత విద్యా సదుపాయం ఏర్పాటు చేశారు.
తన అభ్యర్థనను గౌరవించి పిఠాపురం విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి చేరాలని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.