కోహ్లీ వీరవిహారం.. కేకేఆర్‌పై ఆర్సీబీ అద్భుత విజయం

ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అజేయ శతకంతో మెరవడంతో బుధవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో బెంగళూరు జట్టు మళ్లీ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, కేకేఆర్ వరుస నాలుగు విజయాల పరంపరకు తెరపడింది.

రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ స్టేడియంలో వర్షం కారణంగా మ్యాచ్ 75 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. యువ ఆటగాడు అంగ్‌క్రిష్ రఘువంశీ 71 పరుగులతో ఆకట్టుకోగా, రింకూ సింగ్ 49 పరుగులతో అజేయంగా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్,

జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ తలో వికెట్ తీశారు.

193 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో విజయాన్ని అందించాడు. 60 బంతుల్లో 105 పరుగులు చేసిన కోహ్లీ 11 ఫోర్లు, 3 సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. ఐపీఎల్‌లో తన 9వ సెంచరీ నమోదు చేసిన కోహ్లీ, టీ20 క్రికెట్‌లో మొత్తం 10వ శతకాన్ని కూడా పూర్తి చేశాడు.

దేవదత్ పడిక్కల్ 39 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడి కోహ్లీతో కలిసి రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. తరువాత రజత్ పటిదార్, టిమ్ డేవిడ్ వికెట్లు కోల్పోయినా కోహ్లీ ఒత్తిడిని అధిగమిస్తూ జట్టును విజయతీరాలకు చేర్చాడు. చివరి ఓవర్‌లో మూడు పరుగులు అవసరమైన సమయంలో జితేశ్ శర్మ బౌండరీ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు.

కేకేఆర్ బౌలర్లలో కార్తీక్ త్యాగి మూడు వికెట్లు పడగొట్టినా, కోహ్లీ అసాధారణ బ్యాటింగ్ ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విజయంతో ఆర్సీబీ మరోసారి టైటిల్ రేసులో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.