
మార్కాపురం, కేంద్ర పట్టు మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘నా పట్టు.. నా అభిమానం 2.0’ కార్యక్రమంలో భాగంగా మార్కాపురంలోని జిల్లా పట్టుపరిశ్రమ శాఖ కార్యాలయంలో పట్టు రైతులతో అవగాహన సమావేశం నిర్వహించారు. జిల్లా పట్టుపరిశ్రమ అధికారి డాక్టర్ పి. సుజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మైసూరులోని కేంద్ర పట్టు పరిశోధన, శిక్షణ సంస్థ (CSR&TI) శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు పలు సాంకేతిక సూచనలు అందించారు.
సమావేశంలో శాస్త్రవేత్తలు డాక్టర్ జాయిసి రాణి, డాక్టర్ సౌజన్య మాట్లాడుతూ ‘నా పట్టు.. నా అభిమానం 2.0’ కార్యక్రమం లక్ష్యాలను వివరించారు. పట్టు పురుగుల పెంపకంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కార మార్గాలను సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో నీటిని పొదుపుగా వినియోగిస్తూ డ్రిప్ సేద్యాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
పట్టు పురుగుల పెంపకం ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ ప్రోత్సాహక పథకాలు, సబ్సిడీల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించారు. మల్బరీ సాగుకు అనువైన భూమి ఎంపిక, భూమి తయారీ, ఎరువుల వినియోగం, మొక్కల పెంపకం, యాజమాన్య పద్ధతులపై శాస్త్రీయ వివరణ అందించారు.
డ్వామా పీడీ సి.హెచ్. సువార్త మాట్లాడుతూ, వి.బి.జి. రామ్జీ పథకం కింద మల్బరీ సాగుకు అందుతున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లాలో ఈ అవగాహన కార్యక్రమాలు సెప్టెంబర్ 22 వరకు కొనసాగనున్నట్లు జిల్లా పట్టుపరిశ్రమ అధికారి డాక్టర్ పి. సుజయ్ కుమార్ తెలిపారు. అనంతరం అధికారులు పీవీపురం, కొమరోలు, పొదలకొండపల్లి గ్రామాల్లోని మల్బరీ తోటలు, పట్టు పురుగుల పెంపక కేంద్రాలను పరిశీలించి రైతులకు అవసరమైన సూచనలు చేశారు. గిద్దలూరులోని మోడల్ మల్బరీ సీడ్ ఫారాన్ని సందర్శించి చాకీ కేంద్రం ద్వారా రైతులకు సరఫరా చేస్తున్న చాకీ పురుగులు, మల్బరీ తోటలు, నర్సరీని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పట్టుపరిశ్రమ శాఖ అధికారులు, కేంద్ర పట్టు పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు, గిద్దలూరు సహాయ పట్టుపరిశ్రమ అధికారి, శాఖ సిబ్బంది, పట్టు రైతులు పాల్గొన్నారు.