కాటన్ బ్యారేజ్‌కు రూ.151 కోట్లతో 117 కొత్త గేట్లు’

పిచ్చుకలంక భూముల జీవో సవరణ కోరిన మంత్రి దుర్గేష్

రాజమహేంద్రవరం : ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్‌లో రూ.151 కోట్ల వ్యయంతో 117 కొత్త గేట్ల ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, గోదావరి డెల్టా రైతాంగ ప్రయోజనాల కోసం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన గేట్ల పునరుద్ధరణకు ప్రస్తుతం రూ.151 కోట్లతో 117 కొత్త గేట్ల ఏర్పాటు చేపట్టడం రైతులకు మేలు చేస్తుందన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, రైతాంగ సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్న మంత్రి, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. రైతులకు పెట్టుబడి సాయం, ధాన్యం కొనుగోలు, పెన్షన్ల పెంపు, మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు.

పిచ్చుకలంక భూములపై జీవో సవరణ కోరిన మంత్రి

ధవళేశ్వరం పరిధిలోని పిచ్చుకలంకలో ఉన్న 62 ఎకరాల పర్యాటక భూమిలో ప్రస్తుతం జీవో ప్రకారం కేవలం 20 శాతం మాత్రమే వినియోగానికి అవకాశం ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటకాభివృద్ధికి పూర్తి భూమిని వినియోగించుకునేలా జీవోలో సవరణలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సభాముఖంగా కోరారు.

గోదావరి ప్రాంత అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని పేర్కొంటూ, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి జనసేన పార్టీ, కూటమి ప్రభుత్వం తరఫున మంత్రి కందుల దుర్గేష్ ధన్యవాదాలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.