
విజయనగరం: ఇటీవల భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని విజయనగరంలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి.
పట్టణంలోని శివాలయం వీధిలో ఉన్న ఉమా రామలింగేశ్వరస్వామి ఆలయంలో జనసేన సీనియర్ నాయకుడు గురాన అయ్యలు ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు, పళ్లరసాలతో అభిషేకాలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ పూర్తి ఆరోగ్యంతో కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవలో కొనసాగాలని భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు.
అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో గురాన అయ్యలు మాట్లాడుతూ, గత పదేళ్లుగా రెండు భుజాల గాయాలతో బాధపడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ ప్రజాసేవను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం శ్రమించారని చెప్పారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, యువత భవిష్యత్తు, సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని, ఆయన అంకితభావం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన త్వరగా కోలుకుని మరింత శక్తివంతంగా ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నాయకులు, జనసైనికులు, సాధక్లు, వీర మహిళలు, ఉద్యమకారులు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.