
అవనిగడ్డలో ఘనంగా మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ కబడ్డీ పోటీలు
అవనిగడ్డ ప్రభుత్వ కళాశాల – హైస్కూల్ క్రీడా మైదానంలో స్వర్గీయ మండలి వెంకట కృష్ణారావు శత జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న మండలి వెంకట కృష్ణారావు మెమోరియల్ కబడ్డీ పోటీలను మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఆదివారం సాయంత్రం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ.. సేవా కార్యక్రమాలు, అభివృద్ధిలో మండలి వెంకట కృష్ణారావు నేటితరం నేతలకు స్ఫూర్తిప్రదాత అని పేర్కొన్నారు. దివిసీమ ఉప్పెన బాధితులకు ఆయన చేసిన సేవలు మరువలేనివని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, విద్యా, సాంస్కృతిక శాఖల మంత్రిగా పనిచేసిన కృష్ణారావు అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు. గ్రామీణ యువజన వికాస సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వ్యాయామ ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని సూచించారు. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఈ మైదానంలో వాకర్స్ ట్రాక్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
దేశీయ క్రీడలను ప్రోత్సహించాలి
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. దేశీయ, రాష్ట్ర క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కోడూరుకు చెందిన జమ్మలమడుగు పిచ్చయ్య, భట్లపెనుమర్రుకు చెందిన కామినేని ఈశ్వరరావు అర్జున అవార్డులు సాధించడం దివిసీమకు గర్వకారణమన్నారు.
వారిని స్ఫూర్తిగా తీసుకుని యువ క్రీడాకారులు జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. దివిసీమ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలనే ఉద్దేశంతో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర స్థాయి జట్లు పోటీల్లో పాల్గొనడం విశేషం
గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షుడు మండలి వెంకట్రామ్ మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు గతంలో కూడా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఏడాది మండలి వెంకట కృష్ణారావు శత జయంతి పురస్కరించుకుని ఉమ్మడి రాష్ట్ర స్థాయి పోటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఈ పోటీల్లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, ప్రకాశం, చిత్తూరు, విజయవాడ, ఉయ్యూరు, కోడూరు తదితర ప్రాంతాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా క్రీడా అధికారిణి ఝాన్సీలక్ష్మి, జనసేన నాయకులు మాదివాడ రాము, గరికపాటి శివ, కొట్టే వెంకట్రావు, సజ్జా చలపతి, డాక్టర్ మాధవి, దివి ఏఎంసీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు, జనసేన జిల్లా కార్యదర్శి కొండవీటి సునీత తదితరులు పాల్గొన్నారు.