
మంగళగిరి: రాజకీయాల పవిత్రతను భ్రష్టు పట్టించేందుకు కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారాలను వృత్తిగా మార్చుకున్నారని జనసేన పార్టీ తీవ్రంగా విమర్శించింది. మీడియా వేదికలపై వాస్తవాలను వక్రీకరిస్తూ, జరగనిదాన్ని జరిగినట్లుగా, జరిగినదాన్ని జరగనట్లుగా చూపిస్తూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని పేర్కొంది.
ఇలాంటి ప్రచారాల వల్ల ప్రజలు నిజం ఏది, అబద్ధం ఏది అన్నది గుర్తించలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఇది సమాజానికి, రాజకీయ వ్యవస్థకు ప్రమాదకరమని పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో తప్పుడు ప్రచారాలపై అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని జనసేన నిర్ణయించింది.
దేశం, రాష్ట్రం, ప్రజల అభివృద్ధే పరమావధిగా పనిచేస్తున్న జనసేన పార్టీ, అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరియు నాయకులపై ఎటువంటి అవాస్తవాలు, నిందారోపణలు చేసినా ఇకపై తక్షణమే పోలీస్ కేసులు మరియు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.
అవాస్తవాలను ప్రచారం చేసే వారు ఎవరైనా, ఎంతటి స్థాయిలో ఉన్నా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పార్టీ హెచ్చరించింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి ఈ ప్రకటన విడుదల చేసింది.