మత్తును చిత్తు చేస్తున్న వ్యూహం!

* డ్సగ్స్ పై ప్రభుత్వం యుద్ధం
* బహుముఖమైన ప్రణాళిక
* వివిధ విభాగాల సమన్వయం
* సత్ఫలితాలిస్తున్న సర్కార్ లక్ష్యం

ఆంధ్రప్రదేశ్‌లో మత్తు పదార్థాలపై కూటమి ప్రభుత్వం యుద్ధభేరి మోగించింది. ముఖ్యంగా గంజాయి, ఇతర డ్రగ్స్ నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం “జీరో టాలరెన్స్” (సహించేది లేదు) విధానాన్ని అవలంబిస్తోంది. యువతను సంరక్షించడం, రాష్ట్రాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడమే లక్ష్యంగా పోలీస్, నార్కోటిక్స్ విభాగాలు ఆధునిక సాంకేతికతతో పకడ్బందీ చర్యలు చేపడుతున్నాయి.
తాజా వివరాలు, నివేదికల ప్రకారం ఏపీలో డ్రగ్స్ నివారణ చర్యల్లో సాధించిన కీలక పురోగతి స్సష్టంగానే కనిపిస్తోంది. బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతున్న ప్రభుత్వం చర్యలు ఎలా ఫలితాలనిస్తున్నాయో చూద్దాం.
1. ‘ఈగల్’ (EAGLE) ప్రత్యేక విభాగానికి పగ్గాలు
మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని (EAGLE – Elite Anti-Narcotics Group for Law Enforcement) సాంకేతిక ఆధారిత నిఘా వ్యవస్థగా మార్చారు. ఇటీవల విడుదలైన నివేదికల ప్రకారం ఈ సంస్థ నిఘా, అంతర్రాష్ట్ర సమన్వయం, దాడుల ద్వారా డ్రగ్స్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అడ్డుకుంటోంది.
2. ఆపరేషన్ చైతన్యం, ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్
క్యాంపస్‌లను డ్రగ్స్ రహితంగా మార్చేందుకు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు.
• ఆపరేషన్ చైతన్యం: గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించడానికి అల్లూరి సీతారామరాజు వంటి ఏజెన్సీ జిల్లాల్లో శాటిలైట్, డ్రోన్ సర్వైలెన్స్ ద్వారా పంటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. దీనివల్ల గంజాయి సాగు విస్తీర్ణం భారీగా పడిపోయింది.
• ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్: విద్యాసంస్థల పరిసరాల్లో (100 గజాల లోపు) డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల విక్రయాలను అరికట్టడానికి వేల సంఖ్యలో దుకాణాలను తనిఖీ చేస్తున్నారు. కఠినమైన జరిమానాలు విధించడమే కాకుండా కేసులు నమోదు చేస్తున్నారు.
3. సాంకేతికత, డ్రోన్ల వినియోగం
చేరుకోవడానికి వీలుకాని మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, కొండల్లో సాగయ్యే గంజాయి తోటలను గుర్తించడానికి ఆధునిక డ్రోన్ నిఘా వ్యవస్థను వాడుతున్నారు. అలాగే, సరిహద్దుల వద్ద నిఘా కోసం సీసీటీవీలతో కూడిన చెక్‌పోస్టులు, అనుమానాస్పద నిల్వలను గుర్తించడానికి డాగ్ స్క్వాడ్స్ (ప్రత్యేక కుక్కల బృందాలు)ను రంగంలోకి దించారు.
4. కఠిన చట్టాల ప్రయోగం
మత్తు పదార్థాల వ్యాపారం చేసే అలవాటున్న నేరస్థులను అదుపు చేయడానికి కఠినమైన PIT-NDPS Act (Prevention of Illicit Traffic in Narcotic Drugs and Psychotropic Substances) కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
• డ్రగ్స్ నెట్‌వర్క్‌లను ఆర్థికంగా దెబ్బతీయడానికి నిందితుల ఆస్తులను జప్తు లేదా ఫ్రీజ్ చేస్తున్నారు. ఇలా ఇప్పటివరకు రూ. 29 కోట్లకు పైగా జప్తు చేశారు.
• డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేసే ఆలోచనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
5. ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహం
ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన రైతులు గంజాయి సాగు వైపు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వం విస్తృతంగా ప్రత్యామ్నాయ పంటల ప్రోత్సాహక కార్యక్రమం చేపట్టింది. ఉద్యానవన పంటలు, పౌల్ట్రీ, ఆక్వాకల్చర్ రంగాల్లో వారికి శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు.
6. విద్యార్థుల్లో అవగాహన – ‘ఈగల్ క్లబ్స్’
మత్తుపదార్థాల డిమాండ్‌ను తగ్గించడానికి విద్యాసంస్థల్లో సుమారు 40,000కు పైగా ‘ఈగల్ క్లబ్‌లను’ ఏర్పాటు చేశారు. విద్యార్థులను భాగస్వామ్యం చేస్తూ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. అలాగే, కేజీ నుంచి పీజీ వరకు పాఠ్యప్రణాళికలో “డ్రగ్-ఫ్రీ కరిక్యులమ్” ను చేర్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
– తనిఖీలు… పరీక్షలు…
ఇలా బహుముఖంగా ‘డ్రగ్స్‌పై దండయాత్ర’ చేస్తున్న పోలీసులు విస్తృతంగా, వేగంగా తనిఖీలు నిర్వహిస్తూ అనుమానితులపై పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌ వచ్చినవారికి కౌన్సెలింగ్‌ చేయడంతో పాటు వారి కార్యకలాపాలపై నిఘా పెడుతున్నారు. మత్తు పదార్థాలు వారికి ఎలా అందాయో ఆరా తీస్తూ విక్రేతలపై కేసులు పెడెతున్నారు. ఉదాహరణకు తాజాగా ఎన్టీఆర్‌ జిల్లాలో 4,664 మందికి పరీక్షలు నిర్వహించగా 1,188 మందికి పాజిటివ్‌ వచ్చింది.
– వెంటాడుతున్న వైకాపా పాపం…
వైకాపా హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ వాడకం అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయింది. నాటి పాలకుల నిర్లక్ష్యం, ఉదాసీనత కారణంగా పలువురు యువత మత్తు ఊబిలో కూరుకుపోయారు. ఈ నేపథ్యంలో విజయవాడ కమిషనరేట్‌ పోలీసులు మత్తు మూలాలను గుర్తించి, నిర్వీర్యం చేసేందుకు దశలవారీగా దండయాత్రకు శ్రీకారం చుట్టారు. దీంతో రాత్రి సమయాల్లో జరిగే నేరాల్లో తగ్గుదల కనిపిస్తోంది.
– రెండోసారి పాజిటివ్‌ వస్తే కేసే
పాజిటివ్‌ వచ్చిన వారికి ఎస్‌హెచ్‌వో స్థాయిలో, తర్వాత ప్రభుత్వాసుపత్రిలోని కౌన్సెలింగ్‌ కేంద్రంలో సైకియాట్రిస్ట్‌లతో మత్తు పదార్థాల వల్ల కలిగే సమస్యలపై కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. అనంతరం వీరి పేర్లను పోలీసుల అంతర్గత వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఆయా స్టేషన్ల వారీగా నెగెటివ్‌ వచ్చే వరకు ఈ చర్యలను కొనసాగిస్తారు. రెండోసారి కూడా పాజిటివ్‌ వస్తే ఆ వ్యక్తిపై ఎన్డీపీఎస్‌ కేసు పెట్టి, అరెస్టు చేస్తున్నారు.
పాజిటివ్‌ వచ్చిన వారి కాల్‌ డేటా, ఆర్థిక కార్యకలాపాలు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లు, సోషల్‌ మీడియా ఖాతాలు, స్నేహితులు ఎవరు తదితర అంశాలన్నీ క్షుణ్నంగా పరిశీలించి మత్తు మూలాల్ని గుర్తిస్తున్నారు.
– సమాచారం క్రోడీకరణ, విశ్లేషణ…
తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చిన వారిలో 978 మంది సమాచారాన్ని పోలీసులు క్రోడీకరించారు. వీరిలో 551 మంది 18 నుంచి 25 ఏళ్లలోపువారే. ఆ తర్వాత స్థానంలో 25 నుంచి 30 ఏళ్లలోపు వారు 176 మంది ఉన్నారు.
– డ్రగ్స్‌పై దండయాత్ర 1.0
డ్రగ్స్‌పై దండయాత్ర 1.0 పేరుతో ఐదుగురు మహిళా పోలీసులు జిల్లావ్యాప్తంగా చైతన్యయాత్ర చేపట్టారు. 34 రోజులపాటు 550 కి.మీ. సాగిన సైకిల్‌ యాత్ర ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
– డ్రగ్స్‌పై దండయాత్ర 2.0
ఏప్రిల్ 6న డ్రగ్స్‌పై దండయాత్ర 2.0 కార్యక్రమాన్ని పోలీసులు ప్రారంభించారు. ముందుగా గుర్తించిన 149 హాట్‌స్పాట్లతోపాటు మిగిలిన ప్రాంతాల్లోనూ జేబుదొంగలు, చైన్‌ స్నాచర్లు, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ ఆడేవారు, రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, నేరచరిత్ర ఉన్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. దాదాపు 5 వేల మందికి పరీక్షలు చేయగా 1,188 మందికి పాజిటివ్‌ వచ్చింది. పరీక్షల కోసం ప్రత్యేకంగా బస్సు, డాక్టర్, ల్యాబ్‌ టెక్నీషియన్లను సిద్ధం చేశారు. ర్యాపిడ్‌ కిట్ల ద్వారా.. కొకైన్, ఒపియం, ఎంఫెటామిన్, బార్బిచ్యురేట్స్, బెంజోడయాజపీన్స్, గంజాయి తీసుకున్న వారిని గుర్తిస్తున్నారు.
– దండయాత్ర 3.0లో విద్యాసంస్థలపై దృష్టి
జూన్‌లో ‘డ్రగ్స్‌పై దండయాత్ర 3.0’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. వారందరికీ నెగెటివ్‌ వస్తే పోలీసు శాఖ తరఫున విద్యా సంస్థకు ‘డ్రగ్స్‌ ఫ్రీ క్యాంపస్‌’గా సర్టిఫికెట్‌ ఇస్తారు. కమిషనరేట్‌ పరిధిలోని అన్ని విద్యాసంస్థలూ ఈ సర్టిఫికేషన్‌ తప్పనిసరిగా పొందేలా దృష్టి పెట్టాలని నిర్ణయించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.