
మార్కాపురం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో దివ్యాంగులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించారు.
ఈ జాబ్ మేళాలో 25 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. మొత్తం 170 మంది నిరుద్యోగ యువత ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వారిలో 41 మంది వివిధ కంపెనీల్లో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. మరో 30 మంది దివ్యాంగులు తదుపరి దశ ఇంటర్వ్యూలకు ఎంపికైనట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మల్లికార్జున్‌రావు మాట్లాడుతూ, ఇలాంటి జాబ్ మేళాలను యువత సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కంచిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాలను వినియోగించుకుని నిరుద్యోగ యువత ఉపాధి పొందడంతో పాటు తమ భవిష్యత్తును నిర్మించుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎం. వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇబ్రహీం, నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా ప్లేస్మెంట్ అధికారి టి. నాధన్, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి శిక్షణ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.