
అమరావతి: శ్రీకాకుళంలో సంచలనం సృష్టించిన భూకబ్జా కేసులో మాజీ స్పీకర్, వైఎస్సార్‌సీపీ నేత తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట దక్కలేదు. ఈ కేసులో తమపై నమోదైన ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని కోరుతూ తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు చిరంజీవి నాగ్ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. అలాగే వారిని అరెస్ట్ చేయకుండా మధ్యంతర రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను కూడా కోర్టు అంగీకరించలేదు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ వై. లక్ష్మణరావు ధర్మాసనం, ప్రస్తుతం కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున ఈ దశలో జోక్యం చేసుకోవడం సమంజసం కాదని స్పష్టం చేసింది. అరెస్ట్ భయం ఉంటే ముందస్తు బెయిల్ కోసం సంబంధిత కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించింది. పోలీసులకు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేసు తదుపరి విచారణను జూలై 29కు వాయిదా వేసింది.
ఈ కేసు శ్రీకాకుళం పట్టణంలోని చాపరం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న సుమారు రూ.4 కోట్ల విలువైన 900 గజాల స్థలానికి సంబంధించినది. బతికే ఉన్న యజమాని మరణించినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించి, దొంగ పత్రాల ఆధారంగా ఆ స్థలాన్ని తమ్మినేని కుమారుడి పేరుపై రిజిస్ట్రేషన్ చేయించారని కట్టా జయకిషోర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసులో మొత్తం 13 మందిని నిందితులుగా చేర్చిన పోలీసులు ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. హైకోర్టు మధ్యంతర రక్షణ నిరాకరించిన నేపథ్యంలో తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు ఆమదాలవలసలోని తమ నివాసంలో లేరనే సమాచారం వెలువడింది. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.