
తాడేపల్లిగూడెం : ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ రూ.10 లక్షల విరాళం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీ-4 విధానంలో చేపడుతున్న భవన నిర్మాణానికి పలువురు దాతలు కూడా ఆర్థిక సహకారం ప్రకటించారు.
వాసవి ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం రూ.10 లక్షల విరాళాన్ని ప్రకటించి తొలి విడతగా రూ.5 లక్షలు అందజేసింది. చలంచర్ల మురళి రూ.10 లక్షలు ప్రకటించి తొలి విడతగా రూ.2 లక్షలు విరాళంగా అందించారు. మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ విరాళాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చాలా కాలంగా సొంత భవనం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ సమస్యకు తమ హయాంలో పరిష్కారం లభించడం సంతోషకరమని అన్నారు.
విద్యాభివృద్ధి కోసం ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్య కోసం చేసే వ్యయం సమాజ భవిష్యత్తుకు పెట్టుబడిగా నిలుస్తుందని చెప్పారు.
నియోజకవర్గంలోని విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించేలా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నన్నయ విశ్వవిద్యాలయం వద్ద క్రీడా మైదానాలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యారంగంలో ఆధునిక విధానాలు అమలు చేస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధనకు చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.