
విజయవాడ – మంగళగిరి: రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “జనవాణి – జనసేన భరోసా” కార్యక్రమం ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు.
సోమవారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే ప్రజల సమస్యలను నేరుగా స్వీకరించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.
ప్రజలు అధికారుల చుట్టూ తిరగకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లాలనే లక్ష్యంతో జనసేన పార్టీ “జనవాణి” కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రాజకీయాలు కేవలం ఎన్నికల కోసమే కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికేనని పవన్ కళ్యాణ్ నమ్ముతున్నారని పేర్కొన్నారు.
భూ సమస్యలు, ఉపాధి, పెన్షన్లు, వైద్య సహాయం, రైతు సమస్యలు, మౌలిక వసతులు వంటి అనేక అంశాలపై వచ్చిన వినతులను పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వాల కాలంలో ప్రజల సమస్యలు వినిపించే పరిస్థితి లేకపోయిందని, కానీ జనసేన పార్టీ మాత్రం ప్రజా స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే వారధిగా నిలుస్తోందన్నారు.
“ప్రజలే పార్టీకి బలం… ప్రజల సమస్యలే పార్టీ అజెండా” అనే సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ ముందుకు సాగుతున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, సామాన్య ప్రజలకు న్యాయం జరిగే విధంగా పాలన కొనసాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ పెంకే జగదీష్, లీగల్ సెల్ ప్రతినిధి కోటేశ్వరరావు, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ ఓగురి భాగ్యశ్రీ, ఏరియా ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ బద్రి రమాదేవి, బి.ఎన్. రాజు, కోనసీమ జిల్లా జనసేన నాయకులు గాలీదేవరా నానాజీ, పురుషోత్తం, వడ్డీ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.