
ఖరీఫ్‌కు మే 31 నుంచే సాగునీరు విడుదల – రైతులు ముందస్తుగా నాట్లు వేసుకోవాలి: మంత్రి కందుల దుర్గేష్
రాజమహేంద్రవరం : తూర్పుగోదావరి జిల్లాలో ఖరీఫ్-2026 (ఫసలీ 1436) పంటలకు సాగునీరు అందించేందుకు మే 31 నుంచి ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ నుంచి కాలువలకు నీటిని విడుదల చేయాలని జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశంలో నిర్ణయించారు. కాలువల మరమ్మతుల పురోగతిని బట్టి దశలవారీగా నీటి విడుదల చేపట్టాలని తీర్మానించారు.
రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి సలహా మండలి సమావేశానికి రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇన్‌ఛార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులకు సాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలపై మాత్రమే ఆధారపడకుండా రైతులు ముందస్తు నాట్లు వేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు, ప్రధాన కాలువలు, ఉపకాలువల ద్వారా నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు.
కొంతమంది ప్రజాప్రతినిధులు కాలువల మరమ్మతు పనులు పూర్తికాని నేపథ్యంలో నీటి విడుదలను కొంతకాలం వాయిదా వేయాలని సూచించగా, పనుల పురోగతి మరియు సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
కాటన్ బ్యారేజీ పరిరక్షణకు భారీ నిధులు
ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ 175 గేట్ల మరమ్మతులు, పరిరక్షణ చర్యల కోసం సుమారు రూ.148 కోట్ల నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుకు సమావేశం కృతజ్ఞతలు తెలిపింది.
అదేవిధంగా గోదావరి పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల కోసం రూ.100 కోట్ల నిధులు కేటాయించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ప్రజాప్రతినిధుల సూచనలకు ప్రాధాన్యం
సమావేశంలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, వేగుళ్ల జోగేశ్వరరావు, జ్యోతుల నెహ్రూ తదితరులు సాగునీటి ప్రాజెక్టులు, కాలువల మరమ్మతులు, గోదావరి పుష్కరాల ఏర్పాట్లు, పెండింగ్ పనుల పూర్తి వంటి అంశాలపై పలు సూచనలు చేశారు.
ఇరిగేషన్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ జి. శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో సాగునీటి కొరత తలెత్తే పరిస్థితి లేదని, మే 31 నుంచి నీటి విడుదలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అక్టోబర్ 31 వరకు సాగునీరు, త్రాగునీటి అవసరాలను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.