
గుంటూరు: జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, జనసేన పార్టీ రాజకీయాల్లో మార్పు తీసుకురావాలనే ఆశయంతో ఏర్పడిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు, ప్రజల కోసం పనిచేయాలనే భావజాలం నచ్చి వేలాది మంది పార్టీలో చేరారని పేర్కొన్నారు.
కుల, మత, ప్రాంత భేదాలు లేకుండా “మనుషులం మనం” అనే భావనతో జనసేన ముందుకు సాగుతోందని అన్నారు. గుంటూరు జిల్లా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నానని తెలిపారు.
కొంతమంది వ్యక్తులు డబ్బులు ఇచ్చి అమాయకులను రెచ్చగొట్టి రాజకీయ వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇటీవల జనసేన కార్యకర్తలు, వాహనాలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన ఘటనలో బాధితుల తరఫున వెళ్లి మాట్లాడానని, అయితే తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. జనసేన సిద్ధాంతం కులాలను కలపడం కానీ, విభజించడం కాదని స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లా రేపల్లె పరిధిలో జరిగిన ఘటనలో పోలీసుల వ్యవహరించిన తీరు దురదృష్టకరమని విమర్శించారు. దాడికి గురైన వారిపైనే కేసులు నమోదు చేయడం బాధాకరమన్నారు. పోలీస్ స్టేషన్‌లోనే దాడులు జరగడం పోలీసు చరిత్రలో అరుదైన సంఘటన అని వ్యాఖ్యానించారు.
ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి జనసేన కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ధర్మాన్ని జనసేన పార్టీ వంద శాతం పాటిస్తోందని, అయితే కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కమిటీ సభ్యుడు శిఖా బాలు, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్, నగర ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్, మండల కార్యదర్శి లింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.