
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి మరియు జనసేన రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పై అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న జడ బాల నాగేంద్రపై జనసేన నాయకుడు చీకటి వంశీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి సేవలందిస్తున్న సీనియర్ నాయకుల ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో వ్యక్తిగత కక్షలు తీర్చుకునే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు.
ఈ సందర్భంగా చీకటి వంశీ మాట్లాడుతూ, సమాజంలో గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని, జనసేన పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రామ్ తాళ్లూరి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి లాంటి నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమన్నారు.
“జడ బాల నాగేంద్ర ఖబర్దార్..! నీ చౌకబారు విమర్శలను, నోటి దూలను ఇకనైనా అదుపులో పెట్టుకో. ప్రజాదరణ కలిగిన మా నాయకుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే జనసైనికులు, అభిమానులు చూస్తూ ఊరుకోరు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు కొనసాగిస్తే ఖచ్చితంగా తాటతీస్తాం” అని ఘాటుగా హెచ్చరించారు.
రాజకీయాల్లో నైతిక విలువలు పాటించకుండా, జనసేన పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా మాట్లాడితే రాజకీయంగా తగిన సమాధానం ఇస్తామని తెలిపారు. వ్యక్తిగత విమర్శలు, కుట్రపూరిత ప్రచారాలతో రాజకీయ లాభం పొందాలని ప్రయత్నించడం సరికాదని హెచ్చరించారు.
ఇక జనసేన నాయకుడు ఆమంచి స్వాములు కూడా స్పందిస్తూ, రాజకీయ అర్హత లేని వ్యక్తులు కుట్రపూరితంగా తప్పుడు ప్రచారాలు చేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. కేవలం రాజకీయ ఉనికి కోసం పక్కా ప్రణాళికతో అసత్యాలను ప్రచారం చేయడం ప్రజలు గమనిస్తున్నారని, ఇలాంటి చౌకబారు రాజకీయాలకు త్వరలోనే తగిన బుద్ధి చెబుతామని అన్నారు.