
కాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. చీడిగ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
శెట్టిబలిజ సామాజిక వర్గానికి ఆరాధ్యుడైన దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహాన్ని చీడిగలో ప్రతిష్ఠించారు. రాజమండ్రికి చెందిన వైసీపీ నేత పాలిక శ్రీను ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీకి చెందిన మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మి–సత్యనారాయణమూర్తి దంపతులు విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ వేడుకకు మంత్రి వాసంశెట్టి సుభాష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో కాకినాడ రూరల్ టీడీపీ ఇన్ఛార్జ్ పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి, డీసీఎంఎస్ ఛైర్మన్ పెచ్చెట్టి చంద్రమౌళి, అమలాపురం మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ పెచ్చెట్టి విజయలక్ష్మి, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబు తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
అయితే కార్యక్రమ నిర్వాహకుడైన వైసీపీ నేత పాలిక శ్రీనుతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులతో మంత్రి సుభాష్ ఒకే వేదికను పంచుకోవడం రాజకీయంగా చర్చకు దారితీసింది. టీడీపీ, వైసీపీ రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు ఒకే వేదికపై కనిపించడం పట్ల టీడీపీలోని కొందరు నాయకులు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం.
ఈ వ్యవహారంపై కొందరు టీడీపీ నేతలు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో చీడిగలో జరిగిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.