
రాజమండ్రిలో కారు ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రూ.20 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ప్రియాంక మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని, ఈ ఘటన అత్యంత విషాదకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఆదివారం జిల్లా అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి తక్షణమే రూ.20 లక్షల ఆర్థికసాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై ఇప్పటికే జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.
ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం స్పష్టం చేశారు. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిశోర్ వివరించారు.
దీనిపై స్పందించిన చంద్రబాబు.. నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులపై బలమైన సెక్షన్లు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
రాజమండ్రిలో ఆగస్టు 3న కొందరు యువకులు వేగంగా నడుపుతున్న కారు ఢీకొనడంతో వైద్య విద్యార్థిని ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. తొలుత రాజమండ్రిలో చికిత్స అందించినప్పటికీ, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రియాంక మృతి చెందారు.