
యు.ఏ.ఈ: తెలంగాణలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో దుబాయ్‌లో పలువురు తెలంగాణ యువత జనసేన పార్టీలో చేరారు. పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు యువత తెలిపారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సూచనల మేరకు గల్ఫ్ దేశాల్లోని తెలంగాణ జనసైనికులను ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా గల్ఫ్ జనసేన ఇన్‌చార్జ్ కేసరి త్రిమూర్తులు ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 20 మంది తెలంగాణ యువత జనసేనలో చేరగా, గల్ఫ్ జనసేన నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు.
తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న తెలంగాణ జనసైనికులు, వీర మహిళలు, యువతను ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు గల్ఫ్‌లో తెలంగాణ జనసేన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యాచరణను త్వరలో రూపొందించనున్నట్లు పేర్కొన్నారు.
విదేశాల్లో ఉన్న తెలంగాణ యువతను జనసేనకు మరింత చేరువ చేయడం, పార్టీ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం, పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో యువతను భాగస్వాములను చేయడం తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. గల్ఫ్ నుంచి తెలంగాణ వరకు పార్టీ కార్యక్రమాలకు అవసరమైన సహకారం, సమన్వయం అందించే విధంగా ముందుకు సాగనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో గల్ఫ్ జనసేన యు.ఏ.ఈ ఎగ్జిక్యూటివ్ టీమ్ సభ్యులు నున్నం రాజేష్, పొట్టిపోతు సుబ్రహ్మణ్యం, బండారు శివాజీ, సత్య తోలేటి, పెద్దిరెడ్డి పన్నాల తదితరులు పాల్గొని జనసేనలో చేరిన తెలంగాణ యువతను అభినందించారు.
పార్టీలో చేరిన యువత మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నప్పటికీ మాతృభూమిపై తమ బాధ్యతను మరచిపోమని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేనతో కలిసి పనిచేస్తామని, పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కేసరి త్రిమూర్తులు మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నా మాతృభూమిపై మమకారం తగ్గదని, తెలంగాణ అభివృద్ధి, యువత భవిష్యత్తు, ప్రజా సమస్యలపై అవగాహనతో జనసేనతో కలిసి పనిచేసేందుకు యువత ముందుకు రావడం అభినందనీయమన్నారు. గల్ఫ్‌లో ఉన్న జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణలో జనసేన బలోపేతానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
దుబాయ్ వేదికగా గల్ఫ్ దేశాల నుంచి తెలంగాణ వరకు జనసేన జెండాను మరింత బలంగా ఎగురవేయాలనే సంకల్పంతో యువత ముందుకు సాగుతోందని నాయకులు తెలిపారు. రాబోయే రోజుల్లో మరింత మంది తెలంగాణ యువతను జనసేనలో భాగస్వాములను చేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
జనసేనలో చేరిన వారిలో పెద్ది రెడ్డి పన్నాల, రునిల్ కుమార్, రామ్ చరణ్ షేర్ల, అరుణ్ చిగుర్ల, శివ కుమార్ కోరా, జీవన్ కుమార్ అల్లం, భరత్ గజ్జల, హరీష్ ఫలహారం, శ్రీకాంత్ దొనకంటి, నవీన్ బనావత్, హరీష్ మచ్చర్ల, రితిక్ దుబ్బాక, రాజేష్ కొట్టే తదితరులు ఉన్నారు.