
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో యుద్ధం విషయంలో తన వైఖరిని మార్చుకున్నట్లు తెలుస్తోంది. అణు ఒప్పందం కుదరకపోయినా యుద్ధాన్ని ముగించాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం.. గత కొన్ని నెలలుగా ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని ట్రంప్ ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అంతర్జాతీయ రవాణాకు కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్’ను ఇరాన్ పూర్తిగా తిరిగి తెరిస్తే, కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగించేందుకు ట్రంప్ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
2025 జూన్‌లో నిర్వహించిన ‘ఆపరేషన్ మిడ్నైట్ హ్యామర్’ దాడుల కారణంగా ఇరాన్ అణు మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయని ట్రంప్ తన సీనియర్ సహాయకులతో చెప్పినట్లు కథనం పేర్కొంది. ఈ దాడుల ప్రభావంతో ఇరాన్ ప్రస్తుతం అణ్వాయుధ తయారీని పునఃప్రారంభించే పరిస్థితిలో లేదని ఆయన అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ ఆర్థికంగా, సైనికంగా ఎక్కువ కాలం యుద్ధాన్ని కొనసాగించే స్థితిలో లేదని, ఈ యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని ట్రంప్ వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆశాభావం వ్యక్తం చేసినట్లు సమాచారం. అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ ఇప్పటికే సాధించిందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే అణు ఒప్పందం లేకుండానే యుద్ధాన్ని ముగించాలని ట్రంప్ భావిస్తున్నప్పటికీ, ఇరాన్ విధిస్తున్న కఠినమైన షరతులు సమస్యగా మారుతున్నాయి. అమెరికా విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని, యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని ఇరాన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌ను పూర్తిగా తెరవడంపై కూడా ఇరాన్ నుంచి సానుకూల స్పందన రావడం ట్రంప్‌కు సవాలుగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో యుద్ధానికి ముగింపు పలికే విషయంలో అమెరికా ముందు మరిన్ని దౌత్యపరమైన సవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది.