
మార్కాపురం, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ఫలాలను ప్రజలకు వేగంగా చేరవేయడంతో పాటు వారి సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించే లక్ష్యంతో గిద్దలూరు నియోజకవర్గంలో ‘ఒక నెల–ఒక నియోజకవర్గం–నాలుగు పర్యటనలు’ కార్యక్రమాన్ని ఆగస్టు 7న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు.
అర్ధవీడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అన్ని శాఖల అధికారులు, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలోని తహసీల్దార్లు, మండలాభివృద్ధి అధికారులు (ఎంపీడీఓలు), గిద్దలూరు మున్సిపల్ కమిషనర్ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. అలాగే అవసరమైన సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నారు.
అర్ధవీడు మండలంతో పాటు గిద్దలూరు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. ప్రజల ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ఎలాంటి అలసత్వం ప్రదర్శించకుండా వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.