
మార్కాపురం, మహిళల ఆర్థిక భద్రత, సాధికారత, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం స్వయం సహాయక సంఘాలకు విస్తృత స్థాయిలో రుణ సాయం అందిస్తున్నట్లు మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. కనిగిరి నియోజకవర్గంలోని వెలిగండ్లలో డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం సహాయక సంఘాల బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కనిగిరి నియోజకవర్గ పరిధిలో 464 స్వయం సహాయక సంఘాలకు రూ.75 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, 1,361 మంది సభ్యులకు స్త్రీనిధి ద్వారా రూ.15.07 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
సభ్యులు పొందిన రుణాలను కుటుంబ ఆర్థికాభివృద్ధి, పిల్లల భవిష్యత్తు, ఆదాయాన్ని పెంచే ఉత్పాదక కార్యకలాపాలకు వినియోగించాలని సూచించారు. గ్రామ సమాఖ్యల సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తూ హాజరు నమోదు, లెక్కల నిర్వహణ, రికార్డుల సంరక్షణను పద్ధతిగా కొనసాగించాలని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం కల్పిస్తున్న రుణ అవకాశాలను స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని కోరారు.
అనంతరం అతిథులు రూ.75 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణాలు, రూ.15.07 కోట్ల స్త్రీనిధి రుణాలకు సంబంధించిన నమూనా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శివన్నారాయణ, జిల్లా, మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, బ్యాంకుల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.