
మార్కాపురం, చిన్న, సన్నకారు రైతులకు ఆధునిక వ్యవసాయ యంత్ర పరికరాలను తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకువచ్చి వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత తెలిపారు. వెలిగండ్ల మండల కేంద్రంలో డీఆర్డీఏ–వెలుగు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కస్టమ్ హైరింగ్ సెంటర్ను కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి, డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శివన్నారాయణతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ మార్పులు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యంత్ర పరికరాలను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో కస్టమ్ హైరింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో తిరుపతి తర్వాత కనిగిరి నియోజకవర్గంలో ఈ తరహా కేంద్రం ప్రారంభం కావడం విశేషమన్నారు.
ఈ కేంద్రంలో 35 హెచ్పీ ట్రాక్టర్, ట్రిల్లర్, దమ్ము చక్రాలు, కల్టివేటర్, కేజ్ వీల్, డిస్క్ డ్రిల్తో పాటు పంట సంరక్షణకు అవసరమైన పవర్, మ్యాన్యువల్ స్ప్రేయర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. స్థానిక మార్కెట్ ధరలకు అనుగుణంగా సరసమైన అద్దె రేట్లు నిర్ణయించి, ముందుగా బుకింగ్ చేసుకున్న వారికి తొలి ప్రాధాన్యం ఆధారంగా యంత్రాలు అందజేస్తామని వెల్లడించారు.
స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో ఎఫ్పీఓ, గ్రామ సమాఖ్యల ద్వారా కేంద్రాన్ని నిర్వహిస్తామని తెలిపారు. నగదు పుస్తకం, లెడ్జర్, డిమాండ్, బుకింగ్, ఫిర్యాదుల రిజిస్టర్లను క్రమం తప్పకుండా నిర్వహించి నెలకు ఒకసారి సమీక్షిస్తామని చెప్పారు.
కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ శివన్నారాయణ, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, ఎఫ్పీఓ ప్రతినిధులు, సీఆర్పీలు, రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.