
అమరావతి, : చేనేత కుటుంబాల సంక్షేమం, వృత్తి పరిరక్షణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న సేవలో’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. 12వ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శుక్రవారం చీరాలలో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. పథకం కింద రాష్ట్రంలోని 71,536 అర్హులైన చేనేత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.25 వేల చొప్పున మొత్తం రూ.179 కోట్ల ఆర్థిక సాయం విడుదల చేయనున్నారు.
ప్రభుత్వం ఇప్పటికే చేనేత రంగానికి ఉచిత విద్యుత్, పింఛన్లు, సహకార సంఘాలకు ఆర్థిక మద్దతు వంటి పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. నెలకు చేనేత కుటుంబాలకు 200 యూనిట్లు, పవర్లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందజేస్తోంది. ఈ పథకం ద్వారా 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్లూమ్ యూనిట్లు లబ్ధి పొందుతున్నాయి. అలాగే 50 ఏళ్లు నిండిన సుమారు 85 వేల మంది చేనేత కార్మికులకు పింఛన్లు అందిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
చేనేత రంగ అభివృద్ధిలో భాగంగా 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్ ద్వారా రూ.79 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కు, అమరావతి శాఖమూరులో చేనేత–హస్తకళల మ్యూజియం ఏర్పాటుకు చర్యలు కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో సుస్థిర టెక్స్టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటుకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
శుక్రవారం చీరాల నియోజకవర్గ పర్యటనలో ముఖ్యమంత్రి కొత్తపేటలో నిర్వహించే సభలో పాల్గొని ‘నేతన్న సేవలో’ పథకాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం జాండ్రపేటలోని చేనేత వర్క్షాప్ను సందర్శించి లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. తర్వాత టీడీపీ శ్రేణులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నట్లు అధికారిక కార్యక్రమ వివరాల్లో పేర్కొన్నారు.