
విజయవాడ: దివంగత మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు శతజయంతి ముగింపు వేడుకలు విజయవాడలోని తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర సృజనాత్మక సంస్కృతి సమితి (భాష, సాంస్కృతిక శాఖ), మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా, రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు.
కార్యక్రమంలో మండలి వెంకట కృష్ణారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. తెలుగు భాష, సంస్కృతి, విద్య, గ్రామీణాభివృద్ధి రంగాల్లో ఆయన అందించిన సేవలను పలువురు స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర అధికార భాషా సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెట్టడం, శతజయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించడం సముచిత నిర్ణయమని అన్నారు. తెలుగు భాషాభివృద్ధి, విద్యా రంగంలో మండలి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రిగా ఆయన చేపట్టిన సంస్కరణల ఫలితంగానే రాజమహేంద్రవరంలో కందుకూరి వీరేశలింగం పంతులు, రాజ్యలక్ష్మి పేర్లతో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు.
ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించి తెలుగు భాషకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడంలో మండలి వెంకట కృష్ణారావు కీలక పాత్ర పోషించారని మంత్రి అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ మండలి బుద్ధ ప్రసాద్ చేస్తున్న కృషిని అభినందించారు. తెలుగు భాష వికాసానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందిస్తున్న సేవలను కూడా ప్రశంసించారు.
తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, పద్య నాటకాలు, జానపద కళారూపాలను భావితరాలకు చేరవేసేందుకు కృషి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. సాంస్కృతిక శాఖ మంత్రిగా మండలి వెంకట కృష్ణారావు ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.
అనంతరం ‘మహా పురుషుడు మండలి’ నాటక ప్రదర్శన నిర్వహించారు. ‘అజాతశత్రువు ఆదర్శ నేత మండలి వెంకటకృష్ణారావు’, ‘కృష్ణా మండలి’ గేయకావ్య గ్రంథాలను ఆవిష్కరించడంతో పాటు వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన ప్రముఖులకు ‘మండలి వెంకటకృష్ణారావు భాషా సాంస్కృతిక సేవ పురస్కారాలు’ ప్రదానం చేశారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, భాషాభిమానులు పాల్గొన్నారు.