ప్రజాహితమే ప్రభుత్వ ధ్యేయం.. కుల, మత రాజకీయాలకు తావివ్వొద్దు: బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: ప్రజాహితం, రాష్ట్ర అభివృద్ధే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, కుల, మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భారతీయులుగా ఆలోచించాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. తాడేపల్లిగూడెం మండలం జగ్గన్నపేట గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక, పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందజేసి, ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి అధికారులకు పరిష్కారానికి అవసరమైన సూచనలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గన్నపేట గ్రామంలో ఇప్పటికే సుమారు రూ.4 కోట్ల విలువైన అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, మరో రూ.5 నుంచి రూ.6 కోట్ల విలువైన పనులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. గ్రామీణ రహదారులు, లింక్ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్–2047’ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కులం, మతం కంటే మానవత్వం, భారతీయత ముఖ్యమని పేర్కొన్నారు. దేశ సరిహద్దుల్లో సైనికులు కులాలకు అతీతంగా దేశ సేవ చేస్తున్న స్ఫూర్తిని ప్రజలు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

విద్యారంగంలో అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావడంతో పాటు 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడం వైసీపీ రాజకీయ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. భోగాపురం విమానాశ్రయం, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు వేగంగా అమలవుతున్నాయని, విశాఖ ఉక్కు కర్మాగార పరిరక్షణకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

వైసీపీ నాయకులు ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూడడం మానుకోవాలని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని ఆరోపించారు. ప్రస్తుతం గ్రామాల అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు.

వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆయా సామాజిక వర్గాల ప్రజలు తమ నాయకులుగా భావించడం సహజమేనని, అయితే కులానికి అతీతంగా అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే నాయకత్వం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. అన్ని వర్గాలకు సమాన న్యాయం చేస్తూ రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపే లక్ష్యంతో పనిచేస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి యు. శ్రీనివాస్, తహసీల్దార్ సునీల్ కుమార్, ఎంపీడీవో చంద్రశేఖర్, ఇతర అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.