జీఆర్ఎస్‌లో 25 అర్జీలు స్వీకరణ.. గడువులోగా పరిష్కారానికి కమిషనర్ ఆదేశాలు

రాజమహేంద్రవరం: నగరపాలక సంస్థ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో ప్రజల నుంచి మొత్తం 25 అర్జీలు స్వీకరించారు. అర్జీలను ఎక్కువ రోజులు పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా నాణ్యమైన పరిష్కారం అందించాలని కమిషనర్ రాహుల్ మీనా సంబంధిత అధికారులను ఆదేశించారు.

స్వీకరించిన అర్జీల్లో ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించినవి 8, రెవెన్యూ 2, టౌన్ ప్లానింగ్ 3, పబ్లిక్ హెల్త్ 3, వార్డు సచివాలయాలకు సంబంధించినవి 6, హౌసింగ్ విభాగానికి సంబంధించినవి 3 ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆయా సమస్యలపై వెంటనే చర్యలు తీసుకుని పరిష్కారం చూపాలని కమిషనర్ సంబంధిత అధికారులకు సూచించారు.

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీల పరిష్కారంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం సేకరిస్తోందని, అందువల్ల ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి ప్రజల సంతృప్తి కలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. సమస్యల మూలాలను గుర్తించి పరిష్కరిస్తేనే అర్జీదారులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందని అన్నారు.

అలాగే, తమ అర్జీల స్థితిని తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ పి.వి. రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకటరమణ, సెక్రటరీ శైలజవల్లి, ఎస్‌ఈ రీటా, సిటీ ప్లానర్ జి.వి.ఎస్.ఎన్. మూర్తి, ఎంహెచ్‌ఓ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మలిక్, రెవెన్యూ అధికారి సీహెచ్. శ్రీనివాసరావు తదితర అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.