జనసేన కార్యకర్తలకు అండగా లీగల్ సెల్!

మంగళగిరి: జనసేన పార్టీ కార్యకలాపాలు సమర్థవంతంగా సాగడంలో న్యాయవాదుల పాత్ర అత్యంత కీలకమని పార్టీ రాజకీయ కార్యదర్శి, శాసన మండలి విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. పార్టీ కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, ఎన్నికలు, చట్టపరమైన సవాళ్లను ఎదుర్కోవడంలో లీగల్ సెల్ సేవలు అమూల్యమని పేర్కొన్నారు.

మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లిలో జరిగిన కృష్ణా, గుంటూరు జిల్లాల హైకోర్టు న్యాయవాదుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వంలో రాజకీయ కక్షతో పార్టీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసుల పూర్తి వివరాలను జిల్లాల వారీగా సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని సూచించారు. ప్రతి కేసు ప్రస్తుత స్థితి, విచారణ జరుగుతున్న కోర్టు, అవసరమైన న్యాయ సహాయం వంటి వివరాలను సమగ్రంగా అందించాలని కోరారు.

పార్టీ కోసం పోరాడిన కార్యకర్తలకు చట్టపరంగా అండగా నిలవడం పార్టీ బాధ్యత అని పేర్కొన్నారు. కాకినాడ, విశాఖ నోవాటెల్ ఘటనలు సహా వివిధ సందర్భాల్లో నమోదైన కేసులతో అనేక మంది కార్యకర్తలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గుర్తు చేశారు. ఈ కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో న్యాయవాదుల బాధ్యత మరింత పెరుగుతుందని, పార్టీ అభ్యర్థుల నామినేషన్లు ఎలాంటి లోపాలు లేకుండా చెల్లుబాటు అయ్యేలా అవసరమైన న్యాయ సహాయం అందించాలని తెలిపారు.

అలాగే పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేదా ఇతర ముఖ్య నాయకులపై ఎవరైనా అనుచిత వ్యాఖ్యలు చేసినా, దూషించినా స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి చట్టపరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించకుండా కఠినంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్, ప్రధాన కార్యదర్శి కొప్పెర కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు అమ్మినాయుడు, కృష్ణా జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కిరణ్, సీనియర్ న్యాయవాది సింగలూరి శాంతిప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.