
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి భారీ జనసమీకరణపై కూటమి నాయకులతో ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ సమీక్ష
పాలకొండ: ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు పాలకొండ నియోజకవర్గం నుంచి భారీ జనసమీకరణ చేపట్టాలని ఎమ్మెల్యే శ్రీ నిమ్మక జయకృష్ణ పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆధ్వర్యంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి పరిశీలకులుగా వ్యవహరిస్తున్న బాపట్ల ఎమ్మెల్యే శ్రీ వేగేశన నరేంద్ర వర్మ కూడా సమావేశంలో పాల్గొని సమన్వయ ఏర్పాట్లపై సూచనలు చేశారు.
సమావేశంలో నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనేలా చేపట్టాల్సిన కార్యాచరణ, రవాణా ఏర్పాట్లు, మండలాల వారీ సమన్వయం, ప్రజల భాగస్వామ్యం పెంపు తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. కార్యక్రమం విజయవంతం అయ్యేలా ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికే చారిత్రాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఇది ఉత్తరాంధ్రకు దక్కిన అరుదైన గౌరవమని పేర్కొన్నారు.
ఆగస్టు 1న ప్రతి మండలం నుంచి ఉదయం 5 గంటలకు మండల కేంద్రాల నుంచి ప్రజలు బయలుదేరేలా రవాణా ఏర్పాట్లు చేయాలని, ఇందుకు సంబంధించి ఆయా మండల అధ్యక్షులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, మండల అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.