
సాలూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి
సాలూరు: సాలూరు పట్టణంలోని 28వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. శని, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు ఉండటంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం ముందస్తుగా ఒక్కరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేపట్టింది.
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పెన్షన్లు అందజేశారు. లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, బలహీన వర్గాలకు గౌరవప్రదమైన జీవనం కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ పెన్షన్ మొత్తాన్ని పెంచి పేదలకు అండగా నిలిచిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని పేర్కొన్నారు. లబ్ధిదారుల ముఖాల్లో ఆనందం చూడడమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని అన్నారు.
ఒక్కరోజు ముందుగానే పెన్షన్లు అందుకోవడంతో అవ్వాతాతలు, ఇతర లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా సాలూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పండగను ఘనంగా నిర్వహించారు.