వాడపల్లి ఆలయ అభివృద్ధిపై కలెక్టర్ ఆదేశాలు

కొత్తపేట: వాడపల్లి శ్రీ వెంకటేశ్వరస్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి, కొత్తపేట ఆర్డీవో సత్యనారాయణ, దేవస్థానం ఈవో చక్రధర్ రావు, శ్రీవత్స సీఈఓ బమిడిపాటి కిరణ్‌తో కలిసి ఆలయ అభివృద్ధి, మాడవీధుల విస్తరణ, భూముల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ అభివృద్ధిని మూడు దశల్లో చేపట్టాలని సూచించారు. మొదటి దశలో న్యాయ, పరిపాలనా అంశాలు, రెండో దశలో ఆలయ భౌతిక అభివృద్ధి, రవాణా సౌకర్యాల మెరుగుదల, మూడో దశలో పుష్కరాల నిర్వహణతో పాటు రాబోయే ఇరవై సంవత్సరాల అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికపై అధికారులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.

అభివృద్ధి పనుల్లో భాగంగా నలభై అడుగుల మాడవీధుల విస్తరణ, భక్తుల కోసం క్యూ లైన్లు, పార్కింగ్, డార్మిటరీలు, వకుళమాత అన్నసంతర్పణ భవనం, ఆలయ ప్రధాన ప్రవేశ, నిష్క్రమణ మార్గాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. ఆలయ అభివృద్ధిపై తరచూ సమీక్ష సమావేశాలు నిర్వహించి పనుల్లో ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.

ఎండోమెంట్స్, రెవెన్యూ, మున్సిపల్, పోలీసు శాఖల సమన్వయంతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. భక్తులకు మెరుగైన ఆధ్యాత్మిక అనుభూతిని అందించడంతో పాటు చారిత్రక ఆలయ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ ప్రణాళికల అమలుతో వాడపల్లి ఆలయ పరిసరాలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ సమావేశంలో సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి సీహెచ్ శ్రీనివాస్, ఆత్రేయపురం తహసీల్దార్ ఆర్. మూర్తి, రెవెన్యూ అధికారులు, దేవస్థానం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.