ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం.. డ్రోన్లతో నిఘా పెంచాలి: పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు అటవీ శాఖ కార్యాచరణకు మరింత పదును పెట్టాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. డ్రోన్లు, అత్యాధునిక సాంకేతికత వినియోగంతో నిఘాను బలోపేతం చేసి, జీరో టాలరెన్స్ విధానాన్ని కఠినంగా అమలు చేయాలని సూచించారు. స్మగ్లర్లతో పాటు వారి వెనుక ఉన్న కింగ్‌పిన్‌లు, ఫైనాన్షియర్లపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

గురువారం క్యాంపు కార్యాలయంలో ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధంపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులు గత రెండేళ్ల పురోగతిని వివరించారు. ఈ కాలంలో 506 కేసులు నమోదు చేసి 1,239 మందిని అరెస్టు చేయగా, 372 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే 12 మంది ప్రధాన స్మగ్లర్లపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.

గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించి 35.6 మెట్రిక్ టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గతంతో పోలిస్తే ఎర్రచందనం అక్రమ రవాణా కేసుల్లో శిక్షల శాతం గణనీయంగా పెరిగిందని వివరించారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఎర్రచందనం ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే ప్రత్యేకమైన విలువైన అటవీ సంపద అని, దానిని కాపాడటం అందరి బాధ్యత అని అన్నారు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం అక్రమంగా నిల్వ చేసినా గుర్తించి స్వాధీనం చేసుకునేలా ఇతర రాష్ట్రాల పోలీసు, అటవీ శాఖలతో సమన్వయం పెంచాలని సూచించారు. సాంకేతికత ఆధారిత నిఘా వ్యవస్థను విస్తృతంగా వినియోగిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు అన్ని శాఖలు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.