నేడు ‘తల్లికి వందనం’ నిధుల విడుదల.. 67.47 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద నేడు నుంచి అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ కానుంది. ఈ పథకం ద్వారా ప్రతి అర్హ విద్యార్థికి రూ.13 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు.

ప్రభుత్వం విడుదల చేసే నిధులు నేటి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు విడతల వారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతాయి. ఒక కుటుంబంలో ఎంతమంది అర్హులైన విద్యార్థులు చదువుకుంటే, అంతమందికీ ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది 67.47 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందనుండగా, 42.70 లక్షల మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులు బదిలీ చేయనున్నారు.

‘తల్లికి వందనం’ పథకం అమలుకు ప్రభుత్వం మొత్తం రూ.10,120.78 కోట్లు కేటాయించింది. విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించడం, తల్లుల ద్వారా విద్యకు ప్రోత్సాహం అందించడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వం అమలు చేస్తున్న కీలక సంక్షేమ కార్యక్రమాల్లో ఇది ఒకటిగా నిలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.