టూరిజం రంగంలో యువతకు కొత్త అవకాశాలు: మంత్రి కందుల దుర్గేష్

రాజస్థాన్ (జైపూర్)/అమరావతి: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు పర్యాటక రంగం ద్వారా విస్తృత స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

రాజస్థాన్‌లోని జైపూర్‌లో పర్యటిస్తున్న మంత్రి దుర్గేష్ టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు నరేంద్ర సింగ్ రాథోర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగ అభివృద్ధి, యువతకు ఉపాధి కల్పనపై చర్చించారు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026 వార్షిక బడ్జెట్‌లో పర్యాటక, ఆతిథ్య రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తూ 20 కీలక విభాగాల్లో 10 వేల మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించే నిర్ణయాన్ని మంత్రి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో టూరిస్ట్ గైడ్స్ ఫెడరేషన్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించి ప్రొఫెషనల్ టూర్ గైడ్స్‌గా తీర్చిదిద్దాలని కోరారు.

శిక్షణ పొందిన యువతకు రాష్ట్రంలోనే స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, పర్యాటక రంగంలో పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా నైపుణ్యాలను అభివృద్ధి చేయడం అవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం ఫెడరేషన్ ప్రతినిధులు త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారికంగా ఆహ్వానించారు.

రాష్ట్రంలో ఇప్పటికే ప్రవేశపెట్టిన ఏఐ డిజిటల్ గైడ్స్ సేవలతో పాటు శిక్షణ పొందిన ప్రొఫెషనల్ టూర్ గైడ్స్ కూడా పర్యాటకులకు అందుబాటులో ఉంటారని మంత్రి తెలిపారు. వ్యక్తిగత టూర్ గైడ్స్‌ను కోరుకునే పర్యాటకులకు ఈ యువత సమర్థవంతమైన సేవలు అందించగలరని చెప్పారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి రాష్ట్ర యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. ఈ పర్యటనలో ఏపీ పర్యాటక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.