ఆషాఢ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి సిద్ధం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో జూలై 15 నుంచి ప్రారంభం కానున్న ఆషాఢ మహోత్సవాలు, వారాహి నవరాత్రులు, శ్రీ శాకంబరీ మహోత్సవాల ఏర్పాట్లను ఆలయ అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులతో కలిసి ధర్మకర్తల మండలి సభ్యురాలు తంబళ్లపల్లి రమాదేవి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, క్యూ లైన్లు, భద్రత, ఇతర ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం రమాదేవి మాట్లాడుతూ, సనాతన సంప్రదాయంలో ఆషాఢ మాసానికి విశేష ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందన్నారు. ఈ మాసంలో కనకదుర్గ అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పేర్కొన్నారు. అమ్మవారిని ఇంటి ఆడపడుచుగా భావించి పసుపు, కుంకుమ, గాజులు, చీర తదితర మంగళద్రవ్యాలను ‘ఆషాఢ సారె’గా సమర్పించే సంప్రదాయం ప్రతి ఏడాది పెద్దఎత్తున జరుగుతుందని తెలిపారు.

మహోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి, దేవాదాయ శాఖ అధికారులు, పోలీసు అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.