ఉప్పలగుప్తంలో స్వర్ణాంధ్ర@2047 విజన్‌లో భాగంగా ఉచిత మెగా వైద్య శిబిరం ప్రారంభం

అమలాపురం: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్లాన్లో భాగంగా, కాన్స్టిట్యూయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ (సీవీఏపీయూ) ఆధ్వర్యంలో ఉప్పలగుప్తం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. అమలాపురానికి చెందిన సుధీర్ ఈఎన్‌టీ & జనరల్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్ పార్ట్‌నర్‌షిప్) విధానం ద్వారా నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే ప్రభుత్వ లక్ష్యమని, ప్రజల ఆరోగ్య రక్షణకు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు.

గ్రామీణ ప్రాంత ప్రజలు, వృద్ధులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం ఆనందంగా ఉందని పేర్కొంటూ, శిబిరం నిర్వహణలో భాగస్వాములైన సుధీర్ హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్య బృందానికి అభినందనలు తెలిపారు.

ఈ శిబిరంలో డాక్టర్ వై. సుధీర్ కుమార్ (మధుమేహ నిపుణులు), డాక్టర్ కె. అనూష (ఈఎన్‌టీ, థైరాయిడ్ నిపుణులు), డాక్టర్ ఎస్. స్వాతి (గైనకాలజిస్ట్), డాక్టర్ వై. రాయల్ దిలీప్, డాక్టర్ వై. రాయల్ దినకరన్ (డెంటల్ సర్జన్లు) ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించిన ఈ వైద్య శిబిరానికి ఉప్పలగుప్తం మండలం, పరిసర ప్రాంతాల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.