ఏపీలో కాగ్నిజెంట్.. విశాఖ ఐటీ సెజ్‌కు కేంద్రం ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగానికి మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ టెక్నాలజీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖపట్నంలో ఐటీ/ఐటీఈఎస్ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారిక అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ జూన్ 25న తుది నోటిఫికేషన్ జారీ చేసింది.

విశాఖపట్నం రూరల్ మండలం పరిధిలోని ఐటీ-మధురవాడ-2 ప్రాంతంలో 8.98 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ సెజ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి జూన్ 11న కాగ్నిజెంట్‌కు లెటర్ ఆఫ్ అప్రూవల్ జారీ కాగా, సెజ్ చట్టం ప్రకారం డెవలప్‌మెంట్ కమిషనర్ నేతృత్వంలో అప్రూవల్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కస్టమ్స్ కార్యకలాపాలను సులభతరం చేయడానికి ఈ సెజ్‌ను ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపోగా కూడా ప్రకటించారు.

గతంలో తెలంగాణలోని నానక్‌రామ్‌గూడ, ఆదిభట్లలో ప్రతిపాదించిన రెండు ఐటీ సెజ్‌లను కాగ్నిజెంట్ ఉపసంహరించుకున్న తర్వాత, విశాఖలో భారీ ప్రాజెక్ట్‌కు కేంద్ర అనుమతులు పొందడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు రూ.1,580 కోట్ల పెట్టుబడులు రానుండగా, దాదాపు 8 వేల మందికి ప్రత్యక్ష ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దశలవారీగా అభివృద్ధి చేయనున్న ఈ ఐటీ క్యాంపస్‌తో విశాఖపట్నం ఐటీ హబ్‌గా మరింత వేగంగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.