క్షేత్రస్థాయి నాయకత్వమే జనసేన బలోపేతానికి పునాది: కందుల దుర్గేష్

విజయవాడ : క్షేత్రస్థాయి నాయకత్వాన్ని పెంపొందించడంతో పాటు జనసేన పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయడమే పార్టీ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

విజయవాడలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో విజయవాడ పార్లమెంట్ పరిధిలో నిర్వహించిన ‘మెంబర్‌షిప్ టు లీడర్‌షిప్’ కార్యక్రమంలో భాగంగా జరిగిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో విజయవంతంగా ముగిసింది. గత ఆరు రోజులుగా విజయవాడ పార్లమెంట్ జనసేన పార్టీ నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా నిర్మాణ సారధుల సమాచార సేకరణ కమిటీ సభ్యులను మంత్రి కందుల దుర్గేష్ సత్కరించగా, కమిటీ సభ్యులు కూడా ఆయనను ఘనంగా సన్మానించారు.

దరఖాస్తుదారుల సౌకర్యార్థం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌తో పాటు విజయవాడ ఈస్ట్, వెస్ట్, సెంట్రల్, జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. మంత్రి కందుల దుర్గేష్‌తో పాటు 32 మంది సభ్యులతో కూడిన పరిశీలకుల బృందం ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించింది.

లోక్‌సభ, అసెంబ్లీ, జిల్లా, మండల, గ్రామ స్థాయి కమిటీలతో పాటు లీగల్, విద్యార్థి, మీడియా, ఐటీ & డేటా మేనేజ్‌మెంట్, పర్యావరణం, సేవాదళ్, వీర మహిళ, పాడ్‌కాస్ట్, చేనేత, డాక్టర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, యువజన, సాంస్కృతిక, మత్స్యకార విభాగాలు సహా పలు అనుబంధ కమిటీల పదవుల కోసం వేలాది మంది జనసైనికులు, వీర మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో భారీ సంఖ్యలో కార్యకర్తలు ముందుకు రావడం పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. పార్టీ కోసం నిస్వార్థంగా శ్రమించే కార్యకర్తలకు సముచిత గుర్తింపు, అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు.

అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా తాము కోరుకునే పదవులను స్వయంగా ఎంపిక చేసుకునే విధంగా దరఖాస్తు విధానాన్ని రూపొందించడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు. అందిన దరఖాస్తులను పూర్తిగా పరిశీలించిన అనంతరం పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తుది నిర్ణయం తీసుకుని సమర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు.

ఎంపిక ప్రక్రియ ఆగస్టు నాటికి పూర్తవుతుందని, అనంతరం నూతన కమిటీ సభ్యులతో కలిసి విజయవాడ పార్లమెంట్ పరిధిలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.