మహా పుష్కరాలకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేయాలి: జాయింట్ కలెక్టర్ నైదియాదేవి

అమలాపురం : 2027లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న గోదావరి మహా పుష్కరాలు విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటి నుంచే సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ మేరకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నైదియాదేవి అధ్యక్షతన శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.

జలవనరులు, ఆర్‌డబ్ల్యూఎస్, విద్యుత్, దేవాదాయ, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, రోడ్లు-భవనాలు (ఆర్ అండ్ బి), ట్రాన్స్‌కో, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులు సమావేశంలో పాల్గొని శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై చర్చించారు.

సివిల్ వర్క్స్‌కు సమగ్ర ప్రతిపాదనలు

జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా పుష్కర ఘాట్ల నిర్మాణం, మరమ్మతులు, రహదారుల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనలను అంచనా వ్యయాలతో సహా త్వరితగతిన సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని శాశ్వత, తాత్కాలిక ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.

ఘాట్లు, రహదారులు, భద్రతకు ప్రాధాన్యం

నదీతీర ప్రాంతాల్లో శాశ్వత పుష్కర ఘాట్ల బలోపేతం, రక్షణ గోడల నిర్మాణం, అప్రోచ్ రోడ్ల అభివృద్ధి, తాత్కాలిక దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల ఏర్పాటు వంటి పనులను ప్రాధాన్యంగా చేపట్టాలని పేర్కొన్నారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ స్థలాలు, బారికేడింగ్, ట్రాఫిక్ నియంత్రణపై పోలీస్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేపట్టాలని ఆదేశించారు. ప్రధాన ఘాట్ల వద్ద వుడెన్ బారికేడ్లు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

నాణ్యత, పారదర్శకతతో పనులు

పుష్కరాల కోసం చేపట్టే ప్రతి పనిలో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని జాయింట్ కలెక్టర్ స్పష్టం చేశారు. నిధుల వినియోగంలో పూర్తి పారదర్శకత పాటిస్తూ అంచనాలు సిద్ధం చేసి, టెండర్ల ప్రక్రియను సకాలంలో పూర్తి చేసి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు.

భక్తులకు అన్ని సౌకర్యాలు

దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన ఘాట్ల వద్ద నిర్వహించే పూజా కార్యక్రమాలకు అవసరమైన పూజా సామగ్రిని ధరల నియంత్రణ కమిటీ పర్యవేక్షణలో డ్వాక్రా మహిళల ద్వారా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రముఖ స్వామీజీలు, ప్రజాప్రతినిధుల సమక్షంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు.

మత్స్యశాఖ ఆధ్వర్యంలో పడవలు, గజఈతగాళ్లను అత్యవసర సేవలకు సిద్ధంగా ఉంచాలని, అగ్నిమాపక శాఖ ఘాట్ల వద్ద ఫైర్ ఇంజిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

విద్యుత్, రవాణా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి

ఘాట్ల వద్ద నిరంతర విద్యుత్ సరఫరా, లైటింగ్, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖకు సూచించారు. ఏపీఎస్‌ఆర్టీసీ భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులు నడపాలని, రవాణా శాఖ భారీ వాహనాల రాకపోకలను నియంత్రించాలని తెలిపారు.

జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో ఘాట్ల వద్ద నిరంతర పారిశుద్ధ్య పనులు నిర్వహించడంతో పాటు, భక్తులకు మార్గదర్శకంగా సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో డీఆర్‌ఓ వి. సుబ్బారావు, అడిషనల్ ఎస్పీ మహేంద్ర మత్తె, ఆర్‌డీవో ఎ. సరళాదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.