
మార్కాపురం, జూలై 2: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంలో భాగంగా కొనసాగుతున్న ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత అధికారులను ఆదేశించారు.
ఈ ప్రక్రియలో తక్కువ పురోగతి నమోదైన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చెందిన తహసీల్దార్లు, సూపర్వైజర్లతో గురువారం స్థానిక కలెక్టరేట్లో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని పలుమార్లు సూచించినప్పటికీ కొందరు సిబ్బంది ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. గడువు చాలా తక్కువగా ఉన్నందున ఇకపై ఎలాంటి అలసత్వానికి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.
ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించి, అర్హులైన ప్రతి ఓటరు వివరాలతో సమగ్ర జాబితాలు సిద్ధం చేయాలని సూచించారు. ఎన్యూమరేషన్, డిజిటలైజేషన్ ప్రక్రియలో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమీక్ష సమావేశంలో జాయింట్ కలెక్టర్ పి. శ్రీనివాసులు, తహసీల్దార్లు, సూపర్వైజర్లు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.