
అమలాపురం : గోదావరి నది వెంట బలహీనపడిన ఏటిగట్లను శాశ్వత ప్రాతిపదికన బలోపేతం చేయడానికి సీఎస్ఐఆర్–నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్ఐఓ) నిపుణులతో కలిసి సమగ్ర కార్యాచరణ రూపొందిస్తున్నట్లు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ వెల్లడించారు.
శుక్రవారం కలెక్టరేట్లో సీఎస్ఐఆర్–ఎన్ఐఓ ప్రతినిధులు డాక్టర్ వినీత్, శాస్త్రవేత్తలు జయకుమార్, సేలం తదితరులతో కలిసి ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇటీవల కుండలేశ్వరం వద్ద గోదావరి ఏటిగట్టు కుంగిపోయిన ఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించిందన్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలను శాశ్వతంగా రక్షించేందుకు శాస్త్రీయ పద్ధతుల్లో అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సీఎస్ఐఆర్–ఎన్ఐఓ నిపుణులు, గోదావరి హెడ్‌వర్క్స్ జలవనరుల శాఖ ఇంజినీర్లు సంయుక్తంగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించాలని ఆదేశించారు. గోదావరి తీరం వెంబడి ఎక్కడెక్కడ ఏటిగట్లు బలహీనపడ్డాయో గుర్తించి, వాటి పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక నివేదికతో పాటు సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఈ నివేదికల ఆధారంగా డాక్టర్ ఎం.ఎస్. శ్రీవత్స, సంస్థ సీఈఓ కిరణ్ పమిడిపాటి సాంకేతిక అంచనాలను త్వరితగతిన రూపొందించాలని కోరారు. భవిష్యత్తులో నదీ తీర ప్రాంతాల్లో సంభవించే విపత్తుల తీవ్రతను తగ్గించేందుకు అవసరమైన ప్రాజెక్టు ప్రతిపాదనలను సిద్ధం చేసి, జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (NDMA) నుంచి నిధులు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జలవనరుల శాఖ పర్యవేక్షక ఇంజినీర్ జి. శ్రీనివాసరావు, శాఖ ఇంజినీర్లు, జిల్లా డ్రైనేజీ విభాగం కార్యనిర్వాహక ఇంజినీర్ ఎం.వి.వి. కిషోర్, శాస్త్రవేత్తలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.