
గ్రామీణ ప్రాంతాల నుంచి దూర ప్రాంత పాఠశాలలకు వెళ్లే విద్యార్థులందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె. ఎర్రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
మార్కాపురంలో మాట్లాడుతూ ప్రస్తుతం బాలికలు, 12 సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే ఉచిత బస్సు సౌకర్యం అందుబాటులో ఉందని, అయితే 8వ, 9వ, 10వ తరగతుల్లో చదువుతున్న బాలురకు ఈ సౌకర్యం లేకపోవడంతో పాఠశాలలకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.
ముఖ్యంగా తిప్పాయపాలెం గ్రామానికి చెందిన విద్యార్థులు పాఠశాల నుంచి గ్రామానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని, బి.నరవ తదితర గ్రామాల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు వచ్చే విద్యార్థులు రోజూ రవాణా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
దూర ప్రాంతాల విద్యార్థులు విద్యను కొనసాగించేందుకు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, ఇది విద్య హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. అందువల్ల విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ అంశంపై త్వరలో జిల్లా కలెక్టర్కు ఎస్టీయూ తరఫున వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు.
రాష్ట్రోపాధ్యాయ సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండో రోజు సందర్భంగా కొండేపల్లి, శివరాంపురం, మాల్యవంతునిపాడు, మిట్టమీదిపల్లి, భూపతిపల్లి, వందలపాడు, తిప్పాయపాలెం, కోలభీమునిపాడు, కె.కొత్తపల్లి, జమ్మనపల్లి పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు చేపట్టడంతో పాటు ఉపాధ్యాయుల సమస్యలను తెలుసుకున్నారు.
అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయుల నియామకాలు, సర్ప్లస్ ప్రక్రియలను సమన్వయంతో ఒకేసారి కౌన్సెలింగ్ విధానంలో నిర్వహించాలని, రెగ్యులర్ ఉపాధ్యాయులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఎస్టీయూ నాయకులు కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి సి.హెచ్. గాలయ్య, మండల ప్రధాన కార్యదర్శి తోంపాటి వెంకటరమణ, నాయకులు కె. రామకృష్ణారెడ్డి, కె. సురేంద్ర, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు.