
ప్రకాశం జిల్లా దర్శి పోలీస్ స్టేషన్‌లో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ సోమవారం సబ్ డివిజన్ పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీఎస్పీ, సీఐలు, ఎస్సైలు పాల్గొని పోలీసింగ్‌కు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న గ్రేవ్, నాన్‌గ్రేవ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని, యూఐ కేసుల సంఖ్య తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అరెస్టులు, ఛార్జ్‌షీట్ల దాఖలు, నాన్‌బెయిలబుల్ వారెంట్ల అమలును త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, వారి నుంచి వచ్చే ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేలా స్పందించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 220 కుంభాకార దర్పణాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను మరింత కట్టుదిట్టం చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని హెచ్చరించారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ముఖ్యంగా ఆస్తి సంబంధిత నేరాల్లో రికవరీ శాతాన్ని పెంచాలని సూచించారు. గంజాయి రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు పేకాట, కోడి పందాలు, బహిరంగ మద్యపానంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని, అలాంటి ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా నేరాల నియంత్రణ సాధ్యమవుతోందని ఎస్పీ పేర్కొన్నారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ద్వారా సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలు, మత్తు పదార్థాల దుష్పరిణామాలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసరావు, డీసీఆర్‌బీ దేవ ప్రభాకర్, దర్శి, అద్దంకి అర్బన్, అద్దంకి రూరల్, చీమకుర్తి సీఐలు, సబ్ డివిజన్ ఎస్సైలు పాల్గొన్నారు.