
హైదరాబాద్: రాంచరణ్ హీరోగా నటించిన ‘పెద్ది’ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన హోం శాఖ సంబంధిత మెమోను జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో ఈ ధరల పెంపు అమల్లో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
సినిమా విడుదలకు ముందు జూన్ 3న రాత్రి 8 గంటలకు నిర్వహించనున్న ప్రత్యేక ప్రీమియర్ షోకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శనకు టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600 వరకు నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించింది.
అలాగే సినిమా విడుదలైన తేదీ నుంచి పది రోజుల పాటు, అంటే జూన్ 4 నుంచి 13 వరకు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అమలులో ఉన్న ధరలకు అదనంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 చొప్పున పెంచి వసూలు చేయవచ్చు.
ఇవే కాకుండా ప్రేక్షకుల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.