
పవిత్ర సంగమం వద్ద ఏర్పాట్లను పరిశీలించిన ఈవో వి.కె. శీనా నాయక్
సనాతన హిందూ ధర్మ ప్రచారం, టెంపుల్ టూరిజం అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం (ఫెర్రీ ఘాట్) వద్ద నిర్వహించే ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని ఈ నెల 5వ తేదీ నుంచి పునఃప్రారంభించేందుకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం సన్నాహాలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వాహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్ ఆధ్వర్యంలో ఆలయ స్థానాచార్యులు, వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు పవిత్ర సంగమం వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు.
నవహారతుల నిర్వహణకు అవసరమైన వేదికలు, భక్తుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు, విద్యుత్, లైటింగ్, పారిశుద్ధ్య నిర్వహణ తదితర అంశాలపై అధికారులు సమగ్రంగా సమీక్షించారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఈవో సూచించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, సహాయ కమిషనర్, వైదిక కమిటీ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కృష్ణా నది తీరంలో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని అందించేలా ‘కృష్ణవేణి నదీ నవహారతులు’ కార్యక్రమాన్ని మరింత వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం కృషి చేస్తోందని అధికారులు తెలిపారు.