
విజయవాడ : స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) జయంతి సందర్భంగా విజయవాడలోని దుర్గా కళామందిరంలో ఘనంగా నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు ప్రముఖులు తమ గౌరవాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త కొగంటి సత్యనారాయణ, జనసేన పార్టీ ప్రచార కమిటీ విజయవాడ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొగంటి సత్యనారాయణ మాట్లాడుతూ, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానేతగా ఎన్టీఆర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పేదల సంక్షేమం కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలు, రాజకీయ వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.
తిరుపతి సురేష్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య విలువలు, సంక్షేమ పాలనకు ఎన్టీఆర్ వేసిన బాట నేటి తరానికి మార్గదర్శకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టడం ద్వారానే నిజమైన నివాళి అర్పించిన వారమవుతామని తెలిపారు.
అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాలేపు రామారావు, ముద్దాడ సూరిబాబు, మిరియాల రామకృష్ణ, బాబురావు తదితరులు పాల్గొని ఎన్టీఆర్ సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులర్పించారు.