గ్రామ దేవతల ఉత్సవాలు గ్రామీణ సంస్కృతికి ప్రతీకలు: మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం : రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కడియం మండలం జేగురుపాడు గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ పోలేరమ్మ తల్లి, మహాలక్ష్మీ అమ్మవార్ల జాతర తీర్థ మహోత్సవాల్లో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

గ్రామానికి విచ్చేసిన మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, స్థానిక నాయకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా కొబ్బరికాయ కొట్టి స్థానిక ఆచార వ్యవహారాల ప్రకారం పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంగళవాయిద్యాల నడుమ జాతర వేడుకలు భక్తిశ్రద్ధలతో కొనసాగాయి.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, “గ్రామ దేవతల ఉత్సవాలు కేవలం వేడుకలు మాత్రమే కాదు.. అవి గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యతకు ప్రతీకలు. ఇలాంటి మహోత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను” అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. జాతరను ఘనంగా నిర్వహిస్తున్న గ్రామ ప్రజలు, ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు.

జాతర సందర్భంగా గ్రామమంతా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.