
కాకినాడ : జిల్లా కేంద్రం కాకినాడలో త్వరలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయనున్నట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ, ఉప్పాడ, పెద్దాపురం, పిఠాపురం పరిసర ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడి వందలాది కుటుంబాలు జీవిస్తున్నాయని తెలిపారు.
స్థానికంగా చేనేత ఉత్పత్తులకు మంచి ఆదరణ ఉన్నప్పటికీ, వాటికి జాతీయ స్థాయిలో మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కాకినాడలో జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌హెచ్‌డీపీ) పథకం కింద కాకినాడలో వస్త్ర ప్రదర్శన కేంద్రం ఏర్పాటు చేయాలని గత ఏడాది జూన్‌లో కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్‌కు లేఖ రాశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందిన వెంటనే కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు.
ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా చేనేత, జౌళి శాఖ అధికారులు రూ.45 లక్షల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపినట్లు వివరించారు. ఇప్పటికే కేంద్ర టెక్స్‌టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు నిధుల మంజూరు కోసం లేఖ రాయగా, త్వరలోనే కాకినాడలో మెగా జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ ప్రదర్శన ద్వారా స్థానిక చేనేత కార్మికులకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడంతో పాటు, వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ అవకాశాలు పెరిగి ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.