
చిత్తూరు జిల్లాలోని పలమనేరు కౌండిన్య ఏనుగుల అభయారణ్యంలో ఉన్న కుంకీ ఏనుగుల సంరక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఏనుగుల ఆరోగ్య పరిస్థితి మరియు శాస్త్రీయ అధ్యయనాల కోసం ఇటీవల వాటి రక్త నమూనాలను సేకరించి దేహ్రాదూన్‌లోని వన్యప్రాణి పరిశోధనా సంస్థకు పంపించారు.
పరీక్షల ఫలితాలు వచ్చిన తరువాత ప్రతి ఏనుగుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక గుర్తింపు కార్డులను అందించనున్నారు. ఇవి ఆధార్ కార్డు తరహాలో ఉపయోగపడతాయి. ఈ కార్డుల ద్వారా ఏనుగుల్లో ఉండే జన్యుపరమైన సమస్యలను గుర్తించి తగిన వైద్యం అందించడంతో పాటు వాటి ఆరోగ్య స్థితిని సమగ్రంగా అంచనా వేయవచ్చు.
ఈ పరీక్షలు భవిష్యత్తులో అవసరాలకు అనుగుణంగా అన్ని వివరాలు ఒకేచోట అందుబాటులో ఉండేలా నిర్వహిస్తున్నట్లు అటవీ విభాగ అధికారులు తెలిపారు.
కర్ణాటక నుంచి జయంత్, రంజన్, అభిమన్యు, కృష్ణ, దేవ, వినయ్ అనే ఆరు కుంకీ ఏనుగులను పలమనేరు ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం ఇవన్నీ అక్కడి శిబిరంలోనే ఉన్నాయి. అడవిలోని ఏనుగులు గ్రామాల వైపు రాకుండా మళ్లించేందుకు వీటికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.
ఇప్పటివరకు రెండు సార్లు అడవి ఏనుగులను సురక్షితంగా మళ్లించే ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు.