
• మంటలు విస్తరించకుండా తక్షణం అదుపు చేసే చర్యలు చేపట్టండి
• బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
• ఘటనపై పీసీసీఎఫ్ వివరణ కోరిన ఉపముఖ్యమంత్రివర్యులు
• ప్రజల భాగస్వామ్యంతో అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచన
తిరుపతి పట్టణానికి సమీపంలోని శేషాచలం అడవుల్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణశాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆందోళన వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా అటవీ సంపదకు భారీ స్థాయిలో నష్టం జరగడం దురదృష్టకరమన్నారు. వేసవి తీవ్రత తగ్గే వరకు అగ్నిప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదానికి కొంత మంది గంజాయి, మద్యం సేవించిన ఆకతాయిలు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్న క్రమంలో తీవ్రంగా స్పందించారు. ఘటనకు కారుకులైన వారిని గుర్తించి అరెస్టు చేయాలని, అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సిబ్బంది సమీప గ్రామాల ప్రజల సహకారం తీసుకుని తక్షణ నష్టనివారణ చర్యలు చేపట్టాలన్నారు.
శనివారం తిరుపతి పట్టణానికి ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంలోని బయోట్రిమ్ వెనుక భాగంలో చోటు చేసుకున్న అగ్నిప్రమాద ఘటనపై పీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతి రావు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. మంటలను సాధ్యమైనంత త్వరగా అదుపులోకి తీసుకువచ్చే విధంగా తక్షణం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంటలు మరింత విస్తరించకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. తిరుపతి ఘటనపై పీసీసీఎఫ్ వివరణ తీసుకోవాలని, పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఉపముఖ్యమంత్రి వారి కార్యాలయ అధికారులను ఆదేశించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే యాంటి ఫైర్ స్క్వాడ్ సిబ్బంది 20 మంది, పోలీసులు, మరో 10 మంది టీటీడీ సిబ్బంది మంటలను అదపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారని, ఈ రోజు మధ్యాహ్నం మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయని అటవీ అధికారులు తెలియజేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. యాంటి రెడ్ శాండర్స్ స్క్వాడ్ అటవీ ప్రాంతంలో కూంబింగ్ కి వెళ్లిన సమయంలో అనుమానాస్పద చర్యలపై ఓ కన్నేసి ఉంచాలి. జూన్ చివరి వరకు ఉండే వేసవిలో అటవీ ప్రాంతంలో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
• సరిహద్దు గ్రామాల్లో అవగాహన సదస్సులు
జనసమ్మర్ధం ఉండే అటవీ మార్గాల్లో మఫ్టీలో అటవీ సిబ్బందితోపాటు పోలీసులను నియమించి ఆకతాయిలు, అటవీ విధ్వంసానికి పాల్పడే వారి కదలికలపై నిఘా ఉంచాలి. అగ్నిప్రమాదాల నివారణకు అవసరం అయితే అటవీ పరిసర గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి. అపరిచితులు, అనుమానితులు, ఆకతాయిలు అటవీ పరిసరాలకు వెళ్లే ప్రయత్నం చేస్తే వారిని ఆయా గ్రామాల ప్రజలే అడ్డుకోనే విధంగా అవగాహన కల్పించాలి. దీంతో పాటు అగ్నిప్రమాదాల నివారణ, ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు వీలుగా తక్షణం స్పందించే విధంగా ప్రజల్ని తీర్చిదిద్దాలని సూచించారు. పెద్ద ఎత్తున మంటలు వ్యాపిస్తుంటే సిబ్బంది చేరుకునేలోపు మరింత విస్తరించకుండా జాగ్రత్తలు పాటించే విధంగా అవగాహన కల్పించాలన్నారు.