
పిఠాపురం: అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పిఠాపురం రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఆమోదం తెలిపినందుకు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీకి గొల్లప్రోలు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. గొల్లప్రోలు బీజేపీ పట్టణ కార్యాలయంలో జరిగిన సమావేశంలో నేత చిట్టా మధు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు.
పిఠాపురం ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా దేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తోందని, ఈ నేపథ్యంలో స్టేషన్‌ను ఆధునిక సదుపాయాలతో మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి చేయడం యాత్రికులకు ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. రూ.37.25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనుల ద్వారా ప్రయాణికుల సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడతాయని పేర్కొన్నారు.
స్టేషన్ భవనం, ప్రధాన ద్వారం, దివ్యాంగులకు ప్రత్యేక సదుపాయాలు, ఆధునిక టాయిలెట్లు, డ్రైనేజీ వ్యవస్థ, ప్లాట్‌ఫారమ్ అభివృద్ధి, షెల్టర్లు వంటి పలు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి మద్దతుగా నిలిచిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు సంబంధిత నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు